Saturday, 17 September 2016

భవదీయుడు 

భగవద్గీత అంటే ఏమిటి?

– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి 
☆భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.
☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే  వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.
☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.
☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.
☆ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన  ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు  అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.
☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది? -ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
 -కర్తవ్యం గురించి చెబుతుంది.
 -నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
- ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. 
-సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. 
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. 
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. -ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. 
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. 
-జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. 
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
 -ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. 
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. 
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. -ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. 
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
 -నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.
భగవద్గీత ఆవిర్భావం: భగవద్గీత మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.
ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి. కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నాయి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు. ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి 18 వరకు "జ్ఞాన షట్కము"
1.అర్జునవిషాద యోగము:: "ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారథియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్థించాడు.
2.సాంఖ్య యోగము: సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.
సాంఖ్య యోగం: శరీరము అశాశ్వతము. దానిని తెలుసుకున్న శరీరి (ఆత్మ) శాశ్వతము. విశయానికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్యపాలన చేయాలి. రెండిటిలో ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును.
3.కర్మ యోగము: కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి. కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి. లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.
4. జ్ఞాన యోగము: ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -
"ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పున స్థాపన కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."
5. కర్మసన్యాస యోగము: ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"
6. ఆత్మసంయమ యోగము: ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.
7. జ్ఞానవిజ్ఞాన యోగము: విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.
భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.
ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.
8. అక్షరపరబ్రహ్మ యోగము: బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడింది.
క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.
9. రాజవిద్యారాజగుహ్య యోగము: కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడింది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -
" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."
"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"
10. విభూతి యోగము: ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను. "నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతుల గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు.
11. విశ్వరూపసందర్శన యోగము: శ్రీకృష్ణుడు విశ్వరూపములలో భగవానుని దివ్యగుణ వైభవాల గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్థించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.
"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్థించాడు.
అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.
12. భక్తి యోగము: పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.
13. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము: మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.
ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.
14. గుణత్రయవిభాగ యోగము: ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.
సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.
దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.
15. పురుషోత్తమప్రాప్తి యోగము: త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు. పురుషోత్తమ ప్రాప్తి యోగమును ఆధ్యాయముయందలి 16వ శ్లోకము
శ్లో
❘❘ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్చతే
❘❘
ఇక్కడ క్షరుడు అనగా నాశనమొందు జీవాత్మ అని అర్థము, ఆక్షరుడు అనగా ఆత్మ, పురుషోత్తముడు అనగా పరమాత్మ. ఇదే త్రైత సిద్ధాంతము. జీవాత్మ, అత్మ, పరమాత్మ ల వివరముతో కూడుకొన్న త్రైత సిద్ధాంతమే, సృష్టిఆది యందు దేవునిచే సూర్యునికి చెప్పబడింది. తిరిగి మరల ఆ జ్ఞానమే దేవుని యొక్క మానవరూపము అయిన భగవంతుడు
 శ్రీకృష్ణపరమాత్మ చే ద్వాపరయుగములో పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత రూపములో మరల ఈ లోకానికి చెప్పబడింది.
16. దైవాసురసంపద్విభాగ యోగము: అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి మరియు ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి--------------- భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి, సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ, గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట, కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము, క్షమా, ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.
ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము మరియు అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.
17. శ్రద్దాత్రయవిభాగ యోగము: వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?
18. మోక్షసన్యాస యోగము: కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.
భారతీయ షెడ్యూల్డ్ భాషలలో భగవద్గీత అనువాదాలు
1.సంస్కృతం 2.హిందీ 3.బెంగాలీ 4.అస్సామీ 5.మరాఠీ 6.కన్నడ 7.తెలుగు 8.గుజరాతీ 9.ఒరియా 10.తమిళం 11.ఉర్దూ భాషల్లో భగవద్గీత అనువదాలు ప్రచురించబడ్డాయి.మిగతా 11 షెడ్యూల్డ్ భాషలలో అనువాదాలు ప్రచురించబడాలి.
భగవద్గీత గురించి భాష్యాలు, రచనలు
సంస్కృతంలో
తెలుగులో
ఆంగ్లంలో
ఇతర భాషలలో
మరికొన్ని విశేషాలు
గీత గురించిన అభిప్రాయాలు: భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్వికులు ఉన్నారు. వారిలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరు. ఈయన "హరే కృష్ణ" మంత్రోత్రొపాసకులు. మహాత్మా గాంధీ తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్పూర్తీని పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణాలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్ఫూర్తిని ఇచ్చింది.
అమెరికా అణు శాస్త్రవేత్త, అణుబాంబు సృష్టించిన 'మాన్ హాటన్ ప్రాజెక్ట్' నిర్దేశకుడైన 'రాబర్ట్ ఒపెన్హీమర్' 1945లో మొదటి అణ్వాయుధ ప్రయోగాన్ని చూసినపుడు ఆ ప్రభావాన్ని వర్ణించడానికి గీతలోని విశ్వరూప ఘట్టాన్నుండి (11-32) ఉదహరించాడని అంటారు 
శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో ఆగ్రగణ్యుడైన స్వామి వివేకానంద గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ యోగాలకు ఎంతో విపులంగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని స్వామి శివానంద బోధించారు. ఒక యోగి ఆత్మ కథ రచయిత అయిన పరమహంస యోగానంద, గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంథముగా పేర్కొన్నారు.
భగవద్గీత కాలం: భగవద్గీత ఎప్పుడు వ్రాయబడినదో పూర్తిగా నిర్ధారణ కాలేదు, లేదా నిరూపింపబడలేదు. మహాభారత ఇతిహాసమునందలై వివిధ ఖగోళ ఆధారల అనుసరించి, మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 గా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగారంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనేదానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తుపూర్వం 2500 గా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలుగా చెప్పుచున్నారు.
గీతా శ్లోక సంఖ్య: భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. ప్రస్తుతం లభ్యమౌతున్న సంస్కృత మహాభారతంలో భీష్మ పర్వం 43వ అధ్యాయం, 4వ శ్లోకం ఇలా ఉంది:
షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహకేశవః
అర్జునః సప్తపంచాశత్ సప్తషష్టించ సంజయః
ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే
దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.
ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్‌లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలో (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.
ఏది ఏమైనా, మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44/45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పచ్చు.